ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : విద్యార్థుల్లో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో సీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీఎంఆర్ఐటీ)లో సీఎస్‌సీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించారు. కౌన్సిల్ ఫర్ స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ (సీఎస్‌సీ ఇండియా) సహకారంతో శనివారం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సీఎస్‌సీ ఇండియా అకడమిక్ అండ్ స్ట్రాటజిక్ అలయన్సెస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ తెన్నేటి అన్నాల నరసింహం, సీఎంఆర్ఐటీ డైరెక్టర్ డాక్టర్ ఎం. జంగా రెడ్డి సంయుక్తంగా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ, ఆచరణాత్మక జ్ఞానాన్ని అందించనున్నారు. సాంకేతికత ఆధారిత అభ్యాసాన్ని ప్రోత్సహించడంతో పాటు ఆవిష్కరణల్లో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా విద్యార్థుల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సీఎంఆర్ఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ బి. సత్యనారాయణ, అధ్యాపక బృందం, సీఎస్‌సీ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ (స్కిల్ డెవలప్‌మెంట్) వై. రామ్మోహన్ రావు, కో-ఆర్డినేటర్ బి. ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

