🔸కర్టెన్ రైజర్‌ను ఆవిష్కరించిన సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి
ఆర్ జె న్యూస్, శామీర్ పేట : దేశవ్యాప్తంగా పోలీసు, కేంద్ర సాయుధ బలగాల ప్రతిభను చాటిచెప్పే 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వేదిక కానుంది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు శామీర్‌పేటలోని సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, సీఆర్పీఎఫ్ ఐజీ, ఎస్ఎస్ఎచ్ క్యూ అధికారి విక్రమ్ పాల్గొన్నారు. పోటీలకు సంబంధించిన టీజర్‌తో పాటు కార్యక్రమాల షెడ్యూల్‌ను ఆవిష్కరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల పోలీసు శాఖలు, కేంద్ర సాయుధ బలగాలకు చెందిన మొత్తం 30 బ్యాండ్ బృందాలు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి.
1999లో ప్రారంభమైన ఈ పోటీల ప్రధాన ఉద్దేశం వివిధ రాష్ట్రాల పోలీసు బలగాల మధ్య సాంస్కృతిక మార్పిడి, పరస్పర సహకారం, జాతీయ ఐక్యతను పెంపొందించడమేనని నిర్వాహకులు తెలిపారు. బ్రాస్ బ్యాండ్లు, పైప్ బ్యాండ్లు, డ్రమ్ ప్రదర్శనలతో పాటు ప్రత్యేక సంగీత విన్యాసాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.ప్రజల కోసం ఈ నెల 17న శిల్పారామంలో, 18న లుంబినీ పార్కులో సాయంత్రం 5.30 గంటలకు ప్రత్యేక బ్యాండ్ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కీరవాణి తన బృందంతో కలిసి ‘జనని ప్రియా భారత జనని’ గీతాన్ని ఆలపించి రక్షణ దళాలకు అంకితం చేశారు. దేశభక్తి సంగీతంతో ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

