🔸జీడిమెట్ల సర్కిల్లో విధులు బంద్ చేసి నిరసన
ఆర్ జె న్యూస్, కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల సర్కిల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు సూపర్వైజర్ శివ రామ్ వేధింపులు తట్టుకోలేక మంగళవారం విధులను బహిష్కరించి నిరసనకు దిగారు. మూడుగుళ్ల దేవాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టి తమ సమస్యలను వెల్లడించారు. ఈ సందర్భంగా మహిళా కార్మికులు మాట్లాడుతూ సూపర్వైజర్ వేధింపులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా తిడుతూ, తమతో అమర్యాదగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయన వ్యవహారశైలి వల్ల విధులు నిర్వహించలేకపోతున్నామని, తమకు ఆ సూపర్వైజర్ వద్దని స్పష్టం చేశారు.
విధుల్లో చేరేందుకు లక్ష రూపాయలు తీసుకున్నారని, అనంతరం పీఎఫ్ కోసం దరఖాస్తు చేయాలని కోరితే మరో రూ.10 వేలు ఇవ్వాలని, లేకుంటే పీఎఫ్ అప్లై చేయనని చెబుతున్నారని మహిళా కార్మికులు ఆరోపించారు. తమ తర్వాత విధుల్లో చేరిన వారికి మాత్రం పీఎఫ్ దరఖాస్తు చేశారని, తమకు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తే వారు డబ్బులు ఇచ్చారని, మీరు ఇవ్వలేదని సమాధానం చెబుతున్నారని వాపోయారు. డబ్బులు లేకుంటే మీ బతుకులు ఇంతేనని, మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండంటూ తమను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సూపర్వైజర్ వ్యవహారశైలిపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని పారిశుధ్య కార్మికులు డిమాండ్ చేశారు.
