ప్రత్యేక కార్యాచరణకు ఎంఎంసీ శ్రీకారం.. కాప్రా స్కూల్లో విద్యార్థులకు అవగాహన
ఆర్ జె న్యూస్, కాప్రా : వానాకాలం ముగిసినా దోమల బెడద తగ్గడం లేదు. ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉండే నీరు, పనికి రాని వస్తువులు దోమల పెరుగుదలకు కారణమవుతున్నాయి.
దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు మల్కాజిగిరి నగర పాలక సంస్థ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. దోమల నివారణకు ‘చెక్-5’ పేరుతో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ప్రతి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని నియంత్రించవచ్చని సూచిస్తోంది.
ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు డీసీ రవీందర్ సాగర్ నేతృత్వంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా కాప్రా జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐదు సూత్రాల గోడపత్రికను ఆవిష్కరించారు.
పాటించాల్సిన ఐదు సూత్రాలివే..!
1. నీటిని నిల్వ చేసే పాత్రలు: బకెట్లు, డ్రమ్ములు, నీటి తొట్టెలు, కుండలు వంటి వాటిలో నీరు నిల్వ ఉంచకుండా చూడాలి. పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
2. పూల కుండీల కింద ట్రేలు : పూల కుండీల కింద నీరు నిల్వ ఉండే ట్రేలను తరచూ శుభ్రం చేయాలి. నిల్వ నీరు దోమలకు ఆవాసంగా మారకుండా జాగ్రత్త పడాలి.
3. కూలర్లు, ఎయిర్ కూలర్లు : కూలర్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించి, వాటిని శుభ్రంగా ఉంచాలి. నీరు నిలిచే ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకోవాలి.
4. పాత టైర్లు : ఉపయోగంలో లేని పాత టైర్లలో వర్షపు నీరు నిల్వ లేకుండా చూడాలి. వాటిని ఇంటి పరిసరాల్లో పడేయకుండా తొలగించాలి.
5. ఇతర నీటి నిల్వ వస్తువులు : కొబ్బరిచిప్పలు, పాత బాటిళ్లు, ప్లాస్టిక్ వస్తువులు, పగిలిన కుండలు తదితర వాటిలో నీరు నిల్వ కాకుండా జాగ్రత్త పడాలి.
మూడు పనులు.. క్లియర్ – క్లీన్ – కవర్
దోమల నివారణకు ‘క్లియర్ – క్లీన్ – కవర్’ అనే మూడు సూత్రాలను పాటించాలని ఎంఎంసీ ప్రజలకు అవగాహన కలిగిస్తోంది.
క్లియర్ : ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలి.
క్లీన్ : నీటి పాత్రలు, కూలర్లు, పూల కుండీలను తరచూ శుభ్రం చేయాలి.
కవర్ : నీటి నిల్వ పాత్రలను మూతలతో కప్పి ఉంచాలి.
ప్రజల భాగస్వామ్యం అవసరం : కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి
దోమల నివారణ కేవలం మలేరియా సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని, ప్రతి కుటుంబం తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ప్రజలు తమ ఇళ్లలోనే కాకుండా ఖాళీ స్థలాలు, కాలనీ పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే దోమల రహిత, ఆరోగ్యకరమైన మల్కాజిగిరిని నిర్మించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ ఎస్డబ్ల్యూఎం రవి కుమార్, ఎంటమాలజీ ఏఈ డి. రమేష్, వంపుగూడ డివిజన్ ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్ కె. విజయ్ కుమార్, మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

