🔸కూతురు తిరిగి వస్తుందని నమ్మించి రూ.50 లక్షలకు బేరం.. పూజారి దంపతులు అరెస్ట్
ఆర్ జె న్యూస్, కీసర : కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన తండ్రిని లక్ష్యంగా చేసుకుని తాంత్రిక పూజల పేరుతో రూ.25 లక్షలు వసూలు చేసిన ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. బాధితుడిని నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఆరోపణలపై పూజారి దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కీసర మండలం కుందన్‌పల్లికి చెందిన మణికంఠ రాము కుమార్తె ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన రాము మానసిక ప్రశాంతత కోసం కీసరలోని కాళీమాత ఆలయాన్ని తరచూ సందర్శించేవాడు. ఈ క్రమంలో ఆలయ పూజారిగా ఉన్న క్రాంతి కుమార్, అతని భార్య రత్నతో పరిచయం ఏర్పడింది. బాధితుడి పరిస్థితిని ఆసరాగా చేసుకున్న నిందితులు ప్రత్యేక పూజలు, తాంత్రిక పూజలు నిర్వహిస్తే కుమార్తె తిరిగి ఇంటికి వస్తుందని నమ్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం రూ.50 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో బాధితుడు విడతలవారీగా రూ.25 లక్షలు వారికి అందజేశాడు.
అయినప్పటికీ కుమార్తె తిరిగి రాకపోవడంతో బాధితుడు నిందితులను నిలదీశాడు. ఈ క్రమంలో అతడిని రాంపల్లి ప్రాంతానికి తీసుకెళ్లి ఓ పత్రంపై సంతకం చేయించుకోవడంతో పాటు మొబైల్ ఫోన్, సిమ్ కార్డులను తీసుకున్నట్లు సమాచారం. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రాంతి కుమార్, రత్నను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.22,52,500 నగదు, ఎస్‌బీఐ ఏటీఎం కార్డు, 4.8 గ్రాముల బంగారం, 50 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
కూతురు తిరిగి వస్తుందనే ఆశతో తండ్రి పడిన ఆవేదనను ఆసరాగా చేసుకుని తాంత్రిక పూజల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

