ఆర్జేన్యూస్ స్టాఫ్ రిపోర్టర్, హైదరాబాద్, జూన్ 30 :
బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్ లాంబా గుండు ప్రాంతంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ‘SIR’ జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ కారు డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, భరత్‌నగర్‌కు చెందిన షేక్ ముజీబుర్ రెహమాన్ (51) కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ‘SIR’ జాబితాలో తన పేరు లేకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని గత కొన్ని రోజులుగా ఆయన ఆందోళన చెందుతున్నాడు. తనకు ఏమైనా అయితే ముగ్గురు పిల్లలను ఎవరు చూసుకుంటారని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. శనివారం రాత్రి భార్య ఇస్మాయిల్‌బీ ఆయనకు ఎంత నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. ఆదివారం తెల్లవారుజామున ఇంటి బయట ఉన్న షెడ్డులో ఆయన విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక్కగానొక్క సంపాదనపరుడు మృతి చెందడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
