Sunday, August 16, 2026
Homeక్రైమ్ న్యూస్లైసెన్సు గన్‌తో నీల్గాయ్ వేట..!

లైసెన్సు గన్‌తో నీల్గాయ్ వేట..!

ఆదిలాబాద్ అడవిలో రక్షిత జంతువును కాల్చి చంపిన తండ్రీకొడుకులు

70 కిలోల మాంసంతో బొలెరోలో వస్తుండగా షామీర్‌పేట్‌లో వల.. ముగ్గురు అరెస్ట్

లైసెన్సు రైఫిల్‌, ఎయిర్‌గన్‌, 88 బుల్లెట్లు స్వాధీనం.. ఆర్మ్స్ యాక్ట్‌, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు

మేడ్చల్ ఆర్ జె న్యూస్ జూలై 12 : 

స్వీయ రక్షణ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన లైసెన్సు తుపాకీని అక్రమ వేటకు వినియోగించి రక్షిత జాతికి చెందిన నీల్గాయ్‌ (బ్లూ బుల్)ను కాల్చి చంపిన తండ్రీకొడుకులు సహా ముగ్గురు సభ్యుల ముఠాను షామీర్‌పేట్ పోలీసులు, ఎస్‌వోటీ మల్కాజిగిరి–II బృందం సంయుక్తంగా అరెస్టు చేసింది. ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో వేటాడిన నీల్గాయ్ మాంసాన్ని బొలెరో వాహనంలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మేడ్చల్ జిల్లా షామీర్‌పేట్ మండలం అంతాయిపల్లి గ్రామంలోని బిట్స్ పిలానీ జంక్షన్ వద్ద వాహన తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను షామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి అడిషనల్ డీసీపీ రామ్‌కుమార్ వెల్లడించారు. 

లైసెన్సు గన్‌ను వేటకు వినియోగించిన తండ్రీకొడుకులు

యాప్రాల్‌కు చెందిన గ్రానైట్ వ్యాపారి వేముల సునీల్ సల్మాన్‌రాజ్‌కు స్వీయ రక్షణ కోసం దేశవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యే ఆయుధ లైసెన్సు ఉంది. అదే లైసెన్సు రైఫిల్‌ను దుర్వినియోగం చేస్తూ తన కుమారుడు అఖిల్, పనివాడు ఆదినారాయణతో కలిసి ఆదిలాబాద్ అటవీ ప్రాంతానికి వెళ్లి టెలిస్కోప్ అమర్చిన రైఫిల్‌తో రక్షిత వన్యప్రాణి నీల్గాయ్‌ను కాల్చి చంపాడు. అనంతరం జంతువు చర్మాన్ని ఒలిచి, మాంసాన్ని ముక్కలుగా కోసి బొలెరో వాహనంలో యాప్రాల్‌కు తీసుకొస్తుండగా పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. 

70 కిలోల మాంసం.. ఆయుధాలు స్వాధీనం 

నిందితుల వద్ద నుంచి టెలిస్కోప్ అమర్చిన NPB .30-06 SB లైసెన్సు రైఫిల్, టెలిస్కోప్‌తో కూడిన ఎయిర్‌గన్, 84 లైవ్ రౌండ్లు, 4 ఖాళీ కార్ట్రిడ్జ్‌లు, సుమారు 70 కిలోల నీల్గాయ్ మాంసం, జంతువును కోయడానికి ఉపయోగించిన కత్తి, ఆయుధ లైసెన్సు పుస్తకం, ఎరుపు రంగు మహీంద్రా బొలెరో వాహనం, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

ఆర్మ్స్ యాక్ట్‌, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు

షామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో క్రైం నం. 536/2026గా కేసు నమోదు చేసి వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 సెక్షన్లు 9, 51తో పాటు ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 30 కింద నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. లైసెన్సు ఆయుధాన్ని అక్రమంగా వినియోగించడం తీవ్ర నేరమని, రక్షిత వన్యప్రాణులను వేటాడడం వల్ల పర్యావరణ సమతుల్యతకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. 

 

ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

వన్యప్రాణుల వేట, వాటి మాంసం లేదా శరీర భాగాల రవాణా, విక్రయాలు చట్టరీత్యా శిక్షార్హమైన నేరాలని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా కనిపించినా వెంటనే సమీప పోలీస్‌స్టేషన్ లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో అదనపు డీసీపీ నంద్యాల నరసింహ రెడ్డి, జవహర్ నగర్ ఎసిపి చక్రపాణి ,షామీర్పేట్ సిఐ నరసింహ రెడ్డి,ఎస్ ఓ టి మల్కాజిగిరి టీం 2 ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్, షామీర్పేట్ పోలీసులు,ఎస్ ఓ టి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!