ఆర్ జె న్యూస్ బ్యూరో : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమమే తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప్రధాన లక్ష్యమని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వాద్దామారెడ్డి అన్నారు. హకీంపేట్ ఆర్టీసీ డిపో వద్ద నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో విలీనం చేయడంతో పాటు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు తమ యూనియన్ నిరంతరం పోరాడుతోందన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు నిర్వహించి హక్కులు సాధించిన ఘనత టీఎంయూకు దక్కుతుందని పేర్కొన్నారు.
కార్మికుల హక్కులను కాలరాసి, ఉద్యోగులను మోసం చేసిన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్‌కు రాబోయే గుర్తింపు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి చిత్తుగా ఓడించాలని అశ్వాద్దామారెడ్డి ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, సంక్షేమం కోసం పోరాడుతున్న టీఎంయూకు అత్యధిక మెజారిటీతో మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు.భవిష్యత్‌లోనూ ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఆర్టీసీ కార్మికుల ఐక్యతతోనే హక్కులను సాధించుకోగలమని పేర్కొన్నారు. ఈ సందర్బంగా పలు యూనియన్ లకు చెందిన ఉద్యోగులు టీఎంయూ లో అశ్వాద్దామా రెడ్ది సమక్షంలో చేరారు.ఈ కార్యక్రమంలో టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్, సికింద్రాబాద్ రీజినల్ అధ్యక్షుడు పవన్ కుమార్, కార్యదర్శి శివకుమార్, హకీంపేట్ డిపో గౌరవ అధ్యక్షుడు జైపాల్ రెడ్ది, నాయకులు తులసిరామ్, శ్రీశైలం, శ్రీనివాస్, వెంకటేష్, కృష్ణ, మాలిక్, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

