జవహర్ నగర్ ఆర్ జె న్యూస్ :
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. సంతోష్ నగర్ మెయిన్ రోడ్డులోని ఒక ఇంట్లో ఓ వృద్ధుడిని దారుణంగా కొట్టి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్ నగర్ మెయిన్ రోడ్‌లో నివాసం ఉంటున్న దేవరాజు (70) అనే వృద్ధుడి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి, ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన దేవరాజు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇంట్లో జరిగిన అలికిడి, గొడవను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే జవహర్ నగర్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి అనంతరం కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
దర్యాప్తు ముమ్మరం :
అసలు ఈ హత్యకు గల కారణాలు ఏమిటి? మృతుడు దేవరాజుతో ఎవరి మధ్య ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? లేదా మరేదైనా కారణంతో దాడికి పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని విచారిస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. వృద్ధుడి హత్యతో సంతోష్ నగర్ కాలనీ వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
