ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకల నిర్వహణకు అనుమతులు నిరాకరించడం వివాదానికి దారితీసింది. ఈ నెల 27న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నల్లచెరువు సమీపంలో బీఆర్‌ఎస్ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత నల్లచెరువు ప్రభుత్వ భూమిలో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా.. హైడ్రా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పక్కనే ఉన్న ప్రైవేటు స్థలంలో ఏర్పాట్లు చేపట్టారు. అయితే వేడుకలకు అనుమతులు లేవని, ఎలాంటి ఏర్పాట్లు చేయవద్దని పోలీసులు హెచ్చరించడంతో వివాదం మొదలైంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఏర్పాట్ల ప్రదేశానికి చేరుకుని పోలీసులను ప్రశ్నించారు. వేడుకల నిర్వహణకు ముందుగానే దరఖాస్తు చేసుకున్నామని, జన్మదినానికి ఒక్కరోజు ముందు అనుమతులు లేవని చెప్పడం ఏమిటని నిలదీశారు. దరఖాస్తు చేసుకున్న మరుసటి రోజే అనుమతులు నిరాకరిస్తున్నట్లు తెలిపి ఉంటే ఏర్పాట్లను రద్దు చేసుకునేవారమని అన్నారు. ఒక ఎమ్మెల్యేకే ఈ పరిస్థితి ఎదురైతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తన జన్మదిన వేడుకలను కేవలం ఆర్భాటంగా కాకుండా సేవా కార్యక్రమాల నిర్వహణే ప్రధాన ఉద్దేశంగా చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా కుట్టు మిషన్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు కుర్చీల పంపిణీతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు రూ.20 లక్షలు వెచ్చించి ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో చివరి నిమిషంలో అడ్డంకులు సృష్టించడం ఏమిటని బీఆర్‌ఎస్ నాయకులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అనంతరం జన్మదిన వేడుకల ఏర్పాట్ల ప్రదేశం నుంచి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు ఉప్పల్‌లోని ఏసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఏసీపీ వెంకట్‌రెడ్డితో సమావేశమై అనుమతుల నిరాకరణపై చర్చించారు. ఈ సందర్భంగా అనుమతులు ఎందుకు నిరాకరించారో చెప్పాలని ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులు ఏసీపీని నిలదీశారు.

