వైద్య సేవల్లో జాప్యం ఉండకూడదు.. డా. కె. ఆనంద్
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం కింద కూకట్పల్లిలోని వెల్నెస్ సెంటర్ను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. కె. ఆనంద్ తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, రోగుల ఆన్లైన్ నమోదు, అందిస్తున్న వైద్య సేవలు, రిఫరల్ కేసుల వివరాలను పరిశీలించారు. ప్రయోగశాల సేవలు, నమూనాల సేకరణకు అవసరమైన వాక్యూటైనర్లు, దంత వైద్య సేవల లభ్యతపై ఆరా తీశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంలోని ఓపి, ఐపి, అత్యవసర వైద్య సేవల ప్రక్రియను సమీక్షించారు. రిజిస్ట్రేషన్ నుంచి చికిత్స, డిశ్చార్జి వరకు వివిధ దశలను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో లబ్ధిదారులకు వేగంగా వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి జాప్యం, అంతరాయం ఉండకూడదన్నారు. మందుల లభ్యత, రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ నమోదు, రిఫరల్ వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
