ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఓటర్లు తమ ఓటరు వివరాలను పరిశీలించి, ఏవైనా తప్పులు, అభ్యంతరాలు ఉంటే గ్రామసభల్లో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి సూచించారు. గురువారం శామీర్పేట్ మండలం శామీర్పేట్ గ్రామంలో నిర్వహించిన సర్వే సంబంధిత గ్రామసభకు కలెక్టర్ హాజరై మాట్లాడారు.ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నామని తెలిపారు. 2002 నాటి ఓటరు జాబితాలోని వివరాలను ప్రస్తుతం ఉన్న జాబితాతో సరిచూసుకోవడం జరుగుతోందన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల్లో 2002 నాటి వివరాలు లేకపోయినా, చిన్నచిన్న సవరణలు అవసరమైనా సంబంధిత పత్రాలను పరిశీలించి సరిచేస్తామని చెప్పారు.ప్రతి పోలింగ్ స్టేషన్కు సంబంధించి బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి నోటీసులు అందిస్తారని, ఓటర్లు తమ వద్ద అందుబాటులో ఉన్న ఆధార పత్రాలను బీఎల్ఓలకు అందించాలని సూచించారు. ఓటరు సవరణకు సంబంధించిన 11 రకాల పత్రాల్లో తమ వద్ద అందుబాటులో ఉన్న వాటిని సమర్పిస్తే, తుది జాబితాలో ఓటరు, కుటుంబ సభ్యుల పేర్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ బీఎల్ఓలకు సహకరించాలని కోరారు.
🔸ఫారమ్ 6, 7, 8తో సవరణలు
కొత్తగా ఓటు నమోదు చేసుకునేవారు ఫారమ్-6, మరణించిన వారి పేర్ల తొలగింపునకు ఫారమ్-7, పేరు, ఫోన్ నంబర్, చిరునామా తదితర వివరాల్లో మార్పులకు ఫారమ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. ఓటరు వివరాల సవరణ నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు.
గ్రామసభలో కొందరు ఓటర్లు ప్రస్తుత ఫొటో అప్డేట్ కావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, తుది జాబితాలో అవసరమైన ఫొటో సవరణలు చేపడతామని తెలిపారు.
🔸అంగన్వాడీ కేంద్రం పరిశీలన
అనంతరం కలెక్టర్ సమీపంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలో ఎంతమంది చిన్నారులు ఉన్నారు, వారికి అందుతున్న పౌష్టికాహారం తదితర వివరాలను అంగన్వాడీ టీచర్ను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఎత్తుకు తగిన బరువు ఉండేలా పౌష్టికాహారం అందించాలని సూచించారు. పిల్లల బరువు తగ్గకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. చిన్నారులతో కలెక్టర్ ముచ్చటించి వారితో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో కీసర ఆర్డీఓ వెంకట్రెడ్డి, శామీర్పేట్ తహసీల్దార్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
ఓటరు జాబితాపై అభ్యంతరాలుంటే గ్రామసభల్లో చెప్పాలి 2002 వివరాలతో ప్రస్తుత జాబితాను సరిచూసుకోవాలి : కలెక్టర్ మను చౌదరి
RELATED ARTICLES
