🔸సూరారం సాయిబాబానగర్‌లో పోలీసుల దాడులు.. ఐదుగురి అరెస్ట్.. 22 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మాదకద్రవ్యాల విక్రయాలు, వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో మెథాంఫెటమిన్ (ఎండీఎంఏ) విక్రయాలు, వినియోగానికి పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.4.40 లక్షల విలువైన 22 గ్రాముల మెథాంఫెటమిన్, రూ.4 వేల నగదు, డిజిటల్ తూనిక యంత్రం, ఆరు సెల్‌ఫోన్లు, రెండు చిల్లాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 25న సాయంత్రం హెటిరో ఫార్మా ఎదురుగా సూరారం కాలనీ సాయిబాబానగర్‌లోని ఇసుక కుప్పల సమీపంలో డ్రగ్స్ విక్రయాలు, వినియోగం జరుగుతున్నట్లు ఎస్‌ఐ బి.అరవింద్ గౌడ్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఆయన సమాచారం నమోదు చేసి ఉన్నతాధికారులకు తెలియజేశారు. అనంతరం ఇద్దరు పంచులు, క్లూస్ టీమ్, పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన ఐదుగురు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నారు.విచారణలో చీమర్ల చైతన్య బాలాజీ (21), ఇళ్ల మోహన్ (29) మెథాంఫెటమిన్‌ను సేకరించి వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ముగ్గురు కనపర్తి సంతోష్ మోహన్‌కుమార్ (27), కొప్పుల లాల్ కృష్ణ శ్రీరామ్ (33), శివరాత్రి కాళిదాస్ (32) డ్రగ్స్ కొనుగోలు చేసి వినియోగించేందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. వారి వద్ద తనిఖీలు చేయగా 13 సాచెట్లలో ఉన్న 22 గ్రాముల మెథాంఫెటమిన్, రూ.4 వేల నగదు, డిజిటల్ వెయింగ్ మెషీన్, ఆరు సెల్‌ఫోన్లు, రెండు చిల్లాలు లభించాయి. క్లూస్ టీమ్ పరీక్షల్లో అది మెథాంఫెటమిన్‌గా నిర్ధారణ అయినట్లు పోలీసులు వెల్లడించారు.స్వాధీనం చేసుకున్న వస్తువులను పంచనామా అనంతరం సూరారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో మరో వ్యక్తి ముజీబ్ (బెంగళూరు) ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

