🔸నిర్మల్‌లో ఇద్దరు రాష్ట్ర పన్నుల శాఖ అధికారుల అరెస్ట్.. ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన సీనియర్ అసిస్టెంట్
ఆర్.జె.న్యూస్,నిర్మల్ : ఆడిట్‌లో ఎలాంటి తప్పులు చూపకుండా అనుకూల నివేదిక ఇచ్చేందుకు జువెల్లరీ వ్యాపారి నుంచి రూ.50 వేల లంచం తీసుకుంటూ రాష్ట్ర పన్నుల శాఖకు చెందిన ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కారు. ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు సోమవారం నిర్మల్ స్టేట్ టాక్స్ కార్యాలయంలో నిర్వహించిన ఆపరేషన్‌లో సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయికృష్ణను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారంతో ఎస్టీఓ కొప్పెల గోదావరిని కూడా నిందితురాలిగా చేర్చారు.
🔸లక్షతో మొదలు.. రూ.50 వేలకు బేరం
మంచిర్యాల పట్టణానికి చెందిన జువెల్లరీ వ్యాపారి లక్కింశెట్టి వీర భాస్కరరావుకు సంబంధించిన 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల ఆడిట్ లెక్కల తనిఖీని నిర్మల్ స్టేట్ టాక్స్ అధికారులు చేపట్టారు. ఆడిట్‌లో ఎలాంటి తప్పులు చూపకుండా వ్యాపారికి అనుకూలంగా నివేదిక సమర్పించేందుకు ఎస్టీఓ కొప్పెల గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయికృష్ణ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మొదట రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయగా.. చివరకు రూ.50 వేల వద్ద ఒప్పందం కుదిరింది. లంచం ఇచ్చేందుకు ఇష్టపడని వ్యాపారి ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
🔸పక్కా ప్రణాళికతో వల
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. సోమవారం నిర్మల్‌లోని స్టేట్ టాక్స్ కార్యాలయంలో మాటు వేశారు. రసాయనం పూసిన నోట్లను బాధితుడికి అందించారు. వాటిని మంత్రి సాయికృష్ణ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ఆయన సమాచారంతో ఎస్టీఓ కొప్పెల గోదావరిని కూడా కేసులో నిందితురాలిగా చేర్చారు. ఇద్దరి చేతులకు రసాయన పరీక్షలు నిర్వహించగా ఫలితాలు అనుకూలంగా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
🔸కార్యాలయంలో కలకలం
లంచం సొమ్మును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్టు చేశారు. నిందితుల నివాసాల్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అనంతరం వారిని కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
🔸లంచం అడిగితే 1064కు ఫిర్యాదు
ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని డీఎస్పీ సూచించారు. లంచం డిమాండ్ చేసిన సందర్భంలో టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని కోరారు.
