ఆర్.జె.న్యూస్, జవహర్ నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల దగా పాలనకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. అంబేద్కర్ నగర్ నోబుల్ స్కూల్ వద్ద రోడ్డుపైనే పొయ్యిలు వెలిగించి వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చారు. మాజీ మేయర్ మేకల కావ్య, నేత చామకూర మహేందర్ రెడ్డి మహిళలతో కలిసి రోడ్డుపైనే భోజనం చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మహిళా సంక్షేమాన్ని విస్మరించిందని, తులం బంగారం, రూ.2500, స్కూటీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉచిత బస్సు పేరుతో పురుషులపై చార్జీల భారం పెంచి కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కిట్ మాయం చేసి గర్భిణీలకు భరోసా లేకుండా చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన మహిళా సంఘ భవనాలే ఇప్పటికీ ఉన్నాయని, కాంగ్రెస్ కొత్తగా ఒక్కటి కూడా కట్టలేదని చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. హామీలు అమలు చేయకపోతే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శ్రీవాణి శ్రీనివాస్ రెడ్డి, పల్లపు రవి, సంగీత రాజశేఖర్, మునగాల సతీష్, కో-ఆప్షన్ సభ్యురాలు శోభా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్ఎస్ వంటా వార్పు
RELATED ARTICLES
