🔸గణేష్ మండపాల నిర్వాహకులకు జీనోమ్ వ్యాలీ సీఐ గురువయ్య గౌడ్ సూచనలు
ఆర్.జె.న్యూస్, మూడుచింతలపల్లి :విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సులతో జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జీనోమ్ వ్యాలీ సీఐ గోపగాని గురువయ్య గౌడ్ సూచించారు. రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులతో ఆయన ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులకు ఉత్సవాల నిర్వహణలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, భద్రతా చర్యలు, అవసరమైన ఏర్పాట్లపై సీఐ అవగాహన కల్పించారు. మండపాల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించాలని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లకు అవకాశం లేకుండా వైరింగ్, విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.అలాగే భక్తులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మండపాల ఏర్పాట్లు చేయాలని, రాకపోకలకు అంతరాయం లేకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు. సౌండ్ సిస్టమ్‌ల వినియోగంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు.వినాయకుని పూజలు, ఉత్సవ కార్యక్రమాలు భక్తి భావంతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా జరిగేలా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సీఐ గురువయ్య గౌడ్ కోరారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు.
