🔸మేడ్చల్ ప్రభుత్వ బాలుర పాఠశాలకు రూ.12 కోట్ల నిధులు మంజూరు చేయడం హర్షణీయం: రెడ్డెం గారి నవీన్‌రెడ్డి
ఆర్.జె.న్యూస్, డెస్క్, మేడ్చల్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రవేశ, ఫీజు నియంత్రణ కమిటీ సభ్యులు రెడ్డెం గారి నవీన్‌రెడ్డి అన్నారు.
మేడ్చల్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వై ఐ ఐ ఆర్ ఎస్) పథకంలో భాగంగా రూ.12 కోట్ల నిధులు మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. పేద, గ్రామీణ, వెనుకబడిన వర్గాల పిల్లలకు కూడా ప్రైవేట్, అంతర్జాతీయ ప్రమాణాల వసతులతో కూడిన ప్రభుత్వ విద్యను అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యా రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని నవీన్‌రెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ ప్రభుత్వ బాలుర పాఠశాలకు భారీగా నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మేడ్చల్ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు.
విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విద్యార్థుల భవిష్యత్తుకు మరింత బలమైన పునాది వేస్తాయని నవీన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
