ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – 2026లో భాగంగా నోటీసులు జారీ చేసిన అనంతరం ఓటర్లు సమర్పిస్తున్న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాలోని అంతాయిపల్లి, ఉప్పరపల్లి గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లను కలెక్టర్ సందర్శించి ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మ్యాపింగ్ జరగని ఓటర్లు, ఓటరు కార్డులో వ్యత్యాసాలు ఉన్న కేటగిరీలకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఓటర్లు అందిస్తున్న ధ్రువపత్రాలను త్వరితగతిన పరిశీలించాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఓటర్లు తమ వివరాలు సమర్పించేలా రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్ల ద్వారా అవగాహన కల్పించి సహకరించాలని కోరారు. ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేవారు ఫారం–6, చిరునామా మార్పు కోసం ఫారం–7, మరణించిన లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయిన ఓటర్లకు సంబంధించి ఫారం–8ను అందించి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అనంతరం సంబంధిత పత్రాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో కీసర ఆర్డీవో వెంకట రెడ్డి, ఏఈఆర్‌ఓ మధుసూదన్ రెడ్డి, బీఎల్‌ఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
