Thursday, October 8, 2026
Homeమేడ్చల్ జిల్లా22 పీఎం శ్రీ పాఠశాలల్లో గెస్ట్‌...

22 పీఎం శ్రీ పాఠశాలల్లో గెస్ట్‌ స్పెషల్‌ ఎడ్యుకేటర్ల నియామకం

📰 Generate e-Paper Clip

🔸నెలకు రూ.16,500 గౌరవ వేతనం.. 13న దరఖాస్తులకు గడువు

ఆర్ జె న్యూస్ ,మేడ్చల్‌: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని 22 పీఎం శ్రీ (PM SHRI) సెకండరీ పాఠశాలల్లో గెస్ట్‌ స్పెషల్‌ నీడ్స్‌ ఎడ్యుకేటర్లను నియమించనున్నట్లు సమగ్ర శిక్ష, తెలంగాణ అధికారులు తెలిపారు. పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ఐదు నెలల పాటు.. నవంబరు 2026 నుంచి మార్చి 2027 వరకు ఈ నియామకాలు చేపట్టనున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు (CwSN) ప్రత్యేక విద్యా మద్దతు అందించడం, సమ్మిళిత విద్యను బలోపేతం చేయడం ఈ నియామకాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

22 పాఠశాలల్లో ఒక్కొక్కరు

మేడ్చల్‌, దుండిగల్‌-గండిమైసమ్మ, బాచుపల్లి, ఉప్పల్‌, కాప్రా, శామీర్‌పేట, కీసర, ఘట్కేసర్‌, మూడుచింతలపల్లి తదితర మండలాల్లోని 22 పీఎం శ్రీ పాఠశాలల్లో ఒక్కొక్క గెస్ట్‌ స్పెషల్‌ నీడ్స్‌ ఎడ్యుకేటర్‌ను నియమించనున్నారు.

అర్హతలు ఇవే

స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టుకు నిర్దేశించిన విద్యార్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. బి.ఎడ్‌. (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌), బి.ఎడ్‌. (జనరల్‌)తో పాటు డిప్లొమా/పీజీపీఎడి/పీజీపీసీ ఇన్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో పీజీ డిప్లొమా, ఎస్‌ఎల్‌టీసీ ఇన్‌ విజువల్‌ ఇంపెయిర్‌మెంట్‌, సీనియర్‌ డిప్లొమా ఇన్‌ టీచింగ్‌ ది డెఫ్‌, బి.ఎడ్‌. ఇన్‌ విజువల్‌ ఇంపెయిర్‌మెంట్‌ తదితర అర్హతలు ఉన్న అభ్యర్థులు అర్హులు.
మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేపట్టనుండగా.. స్థానిక గ్రామం, మండలం, జిల్లా వారీగా అర్హులైన అభ్యర్థులకు, తగిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

నెలకు రూ.16,500 గౌరవ వేతనం

ఎంపికైన వారికి నెలకు రూ.16,500 గౌరవ వేతనం చెల్లిస్తారు. మండల విద్యాశాఖాధికారి ధ్రువీకరించిన హాజరు ధ్రువపత్రం ఆధారంగా వేతనం విడుదల చేస్తారు.

ప్రత్యేక అవసరాల పిల్లలకు సేవలు

గెస్ట్‌ ఎడ్యుకేటర్లు ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి అంచనా వేయడంతో పాటు వ్యక్తిగత విద్యా ప్రణాళికలు (IEPs) రూపొందించాలి. విద్యార్థులకు వ్యక్తిగతీకరించిన విద్యా మద్దతు అందించడం, పాఠశాలల్లో వారి నమోదు, కొనసాగింపునకు సహకరించడం, పాఠశాలలు, ఇళ్లను సందర్శించడం వంటి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు భావితా కేంద్రాలు, సమ్మిళిత విద్యా వనరుల వ్యక్తులతో సమన్వయం చేసుకోవాలి.

13లోగా దరఖాస్తు

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు, ఇతర ఆధారాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత పీఎం శ్రీ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అక్టోబరు 13, 2026లోగా సమర్పించాలి. పాఠశాలల వివరాలు సంబంధిత పాఠశాలల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
ఈ నియామకం పూర్తిగా తాత్కాలికమైనదని, మార్చి 2027తో స్వయంచాలకంగా ముగుస్తుందని స్పష్టం చేశారు. ఈ నియామకం ఆధారంగా భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగ హక్కు లేదా క్లెయిమ్‌ ఉండదని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!