Friday, October 30, 2026
Homeమేడ్చల్ జిల్లాడంపింగ్‌ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపాలి

డంపింగ్‌ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపాలి

📰 Generate e-Paper Clip

🔸డీపీఆర్‌ సిద్ధం చేయండి.. నిధులు తెచ్చే బాధ్యత నాది

🔸సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ ఈటల రాజేందర్‌ సవాల్‌

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డంపింగ్‌ యార్డు తరలింపునకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. డంపింగ్‌ యార్డు బాధితుల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేపట్టిన జన సంకల్ప యాత్ర మూడో రోజు గురువారం కీసరలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానికులు, బాధితులు ఆయనకు స్వాగతం పలికారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ డంపింగ్‌ యార్డు పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కలుషిత నీరు, దుర్వాసనతో ప్రజారోగ్యం దెబ్బతింటోందని, చెరువులు కలుషితమవుతున్నాయని, బోర్లలోనూ నీటి నాణ్యతపై సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు.

డంపింగ్‌ యార్డు సమస్యను కేవలం ఆర్థిక కోణంలో కాకుండా ప్రజారోగ్య సమస్యగా చూడాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా చెత్త నుంచి సంపద సృష్టించే సాంకేతికత అందుబాటులో ఉందని, చెత్తను రీసైక్లింగ్‌ చేసే విధానాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. రాంకీ సంస్థ చెత్త నిర్వహణ సక్రమంగా చేపట్టడం లేదని ఆరోపించారు.

తాను ఆరుగురు ముఖ్యమంత్రులతో పోరాడిన వ్యక్తినని, రాజకీయ విమర్శల కోసం కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతోనే పాదయాత్ర చేపట్టానని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బాధితుల ఇబ్బందులను విస్మరించకూడదన్నారు. డంపింగ్‌ యార్డు సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.

డంపింగ్‌ యార్డు తరలింపు కోసం చేపట్టిన పోరాటం ఆగదని ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. శుక్రవారం జవహర్‌నగర్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు బాధితులు, స్థానిక ప్రజలు పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!