🔸అల్వాల్‌లో జెండా ఊపి కాన్వాయ్‌ను ప్రారంభించిన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
ఆర్ జె న్యూస్, మేడ్చల్ జిల్లా : ఎస్‌ఐఆర్ (SIR)కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన పోరాటానికి మద్దతుగా నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీకి బయలుదేరాయి. అల్వాల్‌లోని స్థానిక ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సుమారు వంద కార్లతో భారీ కాన్వాయ్‌గా రోడ్డు మార్గంలో పయనమయ్యారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ జెండా ఊపి కాన్వాయ్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ.. ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఢిల్లీకి వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు. రైల్వే అనుమతులు నిరాకరించడంతో వంద కార్లతో రోడ్డు మార్గంలో ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ గళమెత్తారని, ప్రజాస్వామ్య భవిష్యత్తును కాపాడేందుకు ఆయన పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. చలో ఢిల్లీ రామ్‌లీలా మైదానం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రోహిత్ ఆరోపించారు. నాగ్‌పూర్, వారణాసిలో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయని వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని, కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని తమ పోరాట ఫలితంగా అభివర్ణించారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

