Wednesday, October 28, 2026
Homeమేడ్చల్ జిల్లాపిల్లల భద్రతపై అవగాహన.. పోక్సో చట్టంపై...

పిల్లల భద్రతపై అవగాహన.. పోక్సో చట్టంపై చైతన్యం

📰 Generate e-Paper Clip

🔸జిల్లాలో ఐదు పాఠశాలల్లో న్యాయ సేవాధికార సంస్థ కార్యక్రమాలు

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : పిల్లలపై లైంగిక నేరాల నివారణ, బాలల హక్కుల పరిరక్షణ, ఆన్‌లైన్ వేధింపుల పట్ల అప్రమత్తత కల్పించడమే లక్ష్యంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలోని ఐదు పాఠశాలల్లో ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమాలు నిర్వహించారు. పోక్సో చట్టం–2012పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రధాన జిల్లా న్యాయమూర్తి వి. బాల భాస్కర్ రావు ఆదేశాల మేరకు బోడుప్పల్, కాప్రా, నేరేడ్‌మెట్, పీర్జాదిగూడ, ఉప్పల్, నాగారం ప్రాంతాల్లోని పాఠశాలల్లో కార్యక్రమాలు చేపట్టారు.

ఆన్‌లైన్‌లో అప్రమత్తంగా ఉండాలి

బోడుప్పల్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ప్రధాన జిల్లా న్యాయమూర్తి వి. బాల భాస్కర్ రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.ఎస్.ఎల్. ప్రియాంక విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇంటర్నెట్ వినియోగం ఉపయోగకరమైనదే అయినప్పటికీ వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, ఇతర సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని బాల భాస్కర్ రావు సూచించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తత అవసరమన్నారు.

వేధింపులు ఎదురైతే చెప్పాలి

కాప్రా జెడ్పీహెచ్‌ఎస్‌లో రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్. అమరావతి పోక్సో చట్టంలోని నిబంధనలు, నేరాలకు సంబంధించిన శిక్షలను వివరించారు. పిల్లలకు ఎవరైనా అసౌకర్యం కలిగించినా, అనుచితంగా ప్రవర్తించినా భయపడకుండా నమ్మకమైన పెద్దలకు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు.నేరేడ్‌మెట్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి చిట్టిబొమ్మ ఆశాలత పిల్లలకు గౌరవప్రదమైన, సులభంగా అర్థమయ్యే రీతిలో న్యాయ సహాయం అందించాల్సిన ప్రాధాన్యాన్ని వివరించారు.

పాఠశాలల్లో భద్రతా చర్యలపై చర్చ

పీర్జాదిగూడ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జి.ఎస్.ఎల్. ప్రియాంక పోక్సో కమిటీ సభ్యులతో సమావేశమై బాలల భద్రత, రక్షణ చర్యలపై చర్చించారు. ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లోనూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ అనుచిత స్పర్శ లేదా వేధింపులు ఎదురైతే వెంటనే నమ్మకమైన ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. నాగారం జెడ్పీహెచ్‌ఎస్‌లో న్యాయమూర్తి లాడే రాజు పిల్లల భద్రత, హక్కులపై వివరించారు.ఈ కార్యక్రమాల్లో న్యాయమూర్తులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్, కోర్టు సిబ్బంది, పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!