🔸విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, మధ్యాహ్న భోజనంపై పరిశీలన
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మేడ్చల్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రేణుక దేవి మంగళవారం తనిఖీ చేశారు. మేడ్చల్ మండల విద్యాధికారి వై. శంకరయ్యతో కలిసి పాఠశాలను సందర్శించిన ఆమె విద్యార్థుల అభ్యసన స్థాయి, బోధన, పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, వంట చేసే విధానాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం విద్యార్థుల తెలుగు పఠన సామర్థ్యాన్ని డీఈఓ రేణుక దేవి స్వయంగా పరిశీలించారు. వర్క్‌బుక్‌లను పరిశీలిస్తూ విద్యార్థుల చదువు, అభ్యసన స్థాయిని అంచనా వేశారు. విద్యార్థుల ప్రగతిపై ఉపాధ్యాయులతో చర్చించారు.
ప్రీ-ప్రైమరీ తరగతుల పరిశీలన
పాఠశాలలోని ప్రీ-ప్రైమరీ తరగతి గదులను సందర్శించిన డీఈఓ.. చిన్నారులకు అందిస్తున్న బోధన, కార్యకలాప ఆధారిత అభ్యసన విధానాలను పరిశీలించారు. చిన్నారుల వయసుకు అనుగుణంగా బోధన సాగించాలని సూచించారు.

రికార్డుల తనిఖీ
పాఠశాలలో నిర్వహిస్తున్న విద్యా, పరిపాలనా రికార్డులను డీఈఓ పరిశీలించారు. రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని, విద్యార్థుల అభ్యసన ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
నాణ్యమైన విద్య, విద్యార్థుల అభ్యసన ఫలితాల మెరుగుదల, పరిశుభ్రత, పాఠశాలల సమర్థ నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని డీఈఓ రేణుక దేవి సూచించారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.

