నిబంధనల ఉల్లంఘనపై తనిఖీలు.. పలు షాపులపై కేసులు నమోదు
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలో మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్స్పెక్టర్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఔషధాల విక్రయాల్లో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై పలు మెడికల్ షాపులను పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులు, మందుల నిల్వలు, విక్రయాలకు సంబంధించిన వివరాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మందుల విక్రయాలు జరుగుతున్నాయా, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్నారా అనే అంశాలపై ఆరా తీశారు. మందుల కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన బిల్లులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన పలు మెడికల్ షాపులపై కేసులు నమోదు చేసినట్లు తెలిసింది.ముఖ్యంగా ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన ఔషధాల విక్రయాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్రతి మెడికల్ షాపు నిర్వాహకుడు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, గడువు ముగిసిన మందులను విక్రయించరాదని సూచించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలతో మెడికల్ షాపుల నిర్వాహకుల్లో చర్చ మొదలైంది.
