Friday, August 14, 2026
Homeక్రైమ్ న్యూస్దేవరయాంజాల్‌లో అగ్ని ప్రమాదం...

దేవరయాంజాల్‌లో అగ్ని ప్రమాదం…

🔸కోల్డ్‌ రష్‌ గోదాం బుగ్గిపాలు 🔸కోట్లాది రూపాయల ఆహార సామాగ్రి దగ్ధం..
🔸 ఉదయం నుంచి ఎగిసిపడుతున్న మంటలు
🔸6 ఫైర్‌ ఇంజిన్లతో తీవ్రంగా శ్రమిస్తున్న సిబ్బంది.. రంగంలోకి డీఆర్‌ఎఫ్‌, ఎయిర్‌ఫోర్స్‌, పోలీసులు
🔸కోల్డ్‌ స్టోరేజీల్లో ఫైర్‌ సేఫ్టీ ఎక్కడ..?
🔸పలు గోదాములకు అనుమతులు లేవని గుర్తింపు

ఆర్.జే.న్యూస్ ,మేడ్చల్‌ జిల్లా: శామీర్పేట్ మండలంలో దేవరయాంజాల్‌లోని కోల్డ్‌ రష్‌ లాజిస్టిక్స్‌ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం నుంచి గోదాంలో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. మంటల తీవ్రత అంతకంతకూ పెరగడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. దాదాపు ఆరు గంటలుగా మంటలు అదుపులోకి రాకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

🔸6 ఫైర్‌ ఇంజిన్ల,30 మంది సిబ్బంది తో పోరాటం

ప్రమాదం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దాదాపు 6 ఫైర్‌ ఇంజిన్ల 30 మంది సిబ్బంది తో రంగంలోకి దించారు. ఫైర్‌ సిబ్బంది నిరంతరంగా నీటిని వెదజల్లుతూ మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. గోదాంలో భారీగా ఫుడ్‌ మెటీరియల్‌, ప్యాకింగ్‌ సామాగ్రి, ఇతర దహన పదార్థాలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు అధికారులు భావిస్తున్నారు.మంటల నుంచి వెలువడిన దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలను అదుపు చేసే క్రమంలో ఫైర్‌ సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

🔸రంగంలోకి డీఆర్‌ఎఫ్‌, ఎయిర్‌ఫోర్స్‌,హైడ్రా…

ప్రమాదం తీవ్రత దృష్ట్యా డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌, ఎయిర్‌ఫోర్స్‌, పోలీస్‌, మునిసిపల్‌ సిబ్బంది పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలంలో మోహరించారు. అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.
మంటల తీవ్రతకు ఎయిర్‌ఫోర్స్‌, ఫైర్‌ సిబ్బంది కూడా సోమ్మసిల్లే పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి ఎలాంటి విరామం లేకుండా మంటలతో పోరాడాల్సి రావడంతో సిబ్బంది తీవ్రంగా అలసిపోయారు.

🔸మటన్‌.. చికెన్‌.. ఐస్‌క్రీమ్స్‌..

ఈ కోల్డ్‌ స్టోరేజీలో మటన్‌, చికెన్‌, ఐస్‌క్రీమ్స్‌తో పాటు వివిధ రకాల ఫుడ్‌ మెటీరియల్‌ను భారీగా నిల్వ చేసినట్లు సమాచారం. నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లకు ఇక్కడి నుంచే ఆహార పదార్థాలు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది.మంటల ధాటికి గోదాంలో నిల్వ ఉంచిన భారీ మొత్తంలో ఆహార సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. కోట్లాది రూపాయల విలువైన మెటీరియల్‌ కాలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో నష్టం ఎంత జరిగిందనే విషయం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే తేలనుంది.

🔸ఫైర్‌ సేఫ్టీ అనుమతులు ఉన్నాయా.?

ఈ ప్రమాదం మరో కీలక ప్రశ్నను తెరపైకి తెచ్చింది. కోట్లాది రూపాయల విలువైన ఆహార పదార్థాలను నిల్వ చేసే కోల్డ్‌ స్టోరేజీలకు కనీస ఫైర్‌ సేఫ్టీ ప్రమాణాలు ఉన్నాయా? అవసరమైన అనుమతులు తీసుకున్నారా? అన్నదానిపై చర్చ మొదలైంది.అధికారుల ప్రాథమిక పరిశీలనలో ప్రమాదానికి గురైన కోల్డ్‌ స్టోరేజీకి ఫైర్‌ సేఫ్టీకి సంబంధించిన అనుమతులు లేవని గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా దేవరయాంజాల్‌ పరిసర ప్రాంతాల్లోని పలు కోల్డ్‌ స్టోరేజీలు, గోదాములకు కూడా ఫైర్‌ సేఫ్టీ అనుమతులు లేవని గుర్తించినట్లు సమాచారం.

🔸ప్రమాదం జరిగితేనే తనిఖీలేనా..?

పెద్ద మొత్తంలో దహన పదార్థాలు, ప్యాకింగ్‌ మెటీరియల్‌, ఫుడ్‌ ఉత్పత్తులు నిల్వ చేసే గోదాముల్లో అగ్ని ప్రమాదం జరిగితే మంటలు క్షణాల్లో వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సి ఉన్నప్పటికీ.. అనుమతులు లేకుండానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న అంశం ఇప్పుడు అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ప్రమాదం జరగకముందే తనిఖీలు చేయాల్సిన అధికారులు.. ప్రమాదం జరిగిన తర్వాతే మేల్కొంటున్నారా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

🔸నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

మేడ్చల్‌ జిల్లా ఫైర్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ అధికారి ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ దేవరయాంజాల్‌ పరిధిలో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలను పరిశీలిస్తున్నామని తెలిపారు. పలు కోల్డ్‌ స్టోరేజీలకు అవసరమైన ఫైర్‌ సేఫ్టీ అనుమతులు లేవని గుర్తించినట్లు చెప్పారు. నిబంధనలు పాటించని కోల్డ్‌ స్టోరేజీలు, గోదాములపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

🔸ఇకనైనా మేల్కొనాల్సిందే..!

దేవరయాంజాల్‌లో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లోని అన్ని కోల్డ్‌ స్టోరేజీలు, గోదాములపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. ఫైర్‌ సేఫ్టీ అనుమతులు, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర మార్గాలు, భద్రతా ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
అనుమతులు లేకుండా నడుస్తున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు.. భవిష్యత్తులో ఇలాంటి భారీ ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!