మరో ఎనిమిది కేసుల పరిష్కారం.. రూ.6,500 జరిమానా విధించిన న్యాయస్థానం
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకుంది. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన కేసుల్లో ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. గురువారం మేడ్చల్‌లోని ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కమ్ VII అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో మొత్తం ఎనిమిది కేసులను విచారించి పరిష్కరించారు. వీటిలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన రెండు కేసులకు సంబంధించి రూ.2 వేల జరిమానా విధించారు. మరో ఆరు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రూ.4,500 జరిమానాతో పాటు ఐదుగురికి జైలు శిక్ష విధించారు. ఒకరికి 10 రోజులు, మరో నలుగురికి నాలుగు రోజుల చొప్పున జైలు శిక్ష ఖరారు చేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ ట్రాఫిక్ సీఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, తప్పనిసరిగా చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
