🔸మార్వాడీ వ్యాపారి నేమారాం హత్య కేసులో ఇద్దరు నిందితుల అదుపులోకి ?
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్వాడీ వ్యాపారి నేమారాం హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో బోయిన్‌పల్లి హస్మత్‌పేటకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్థిక లావాదేవీలే కారణమా ?
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. నేమారాంకు బోయిన్‌పల్లి హస్మత్‌పేటకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తితో చాలాకాలంగా ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరి మధ్య ఉన్న పరిచయం, నమ్మకంతో నేమారాం పలుమార్లు డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో డబ్బుల వ్యవహారమే హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నేమారాంను గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
పోలీసుల దర్యాప్తు ముమ్మరం
హత్యకు దారితీసిన అసలు కారణాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు, నిందితుల పాత్రపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం , కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
