Friday, October 30, 2026
Homeమేడ్చల్ జిల్లాఅర్హతే ప్రామాణికం.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో...

అర్హతే ప్రామాణికం.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేదు!

📰 Generate e-Paper Clip

🔸అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా అభివృద్ధిలో వివక్ష చూపం..

🔸పోచారంలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేదని, అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా అభివృద్ధి విషయంలో ఎలాంటి వివక్ష చూపబోమని తెలిపారు. బుధవారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పోచారంలో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పేదలకు గౌరవప్రదమైన నివాసం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. హైదరాబాద్‌లో భూముల విలువ ఎకరాకు వందల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ, పేదలు నివసించే ప్రాంతాల్లోనే వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. నగరంలో ఉపాధి పొందుతున్న పేదలను దూర ప్రాంతాలకు తరలించి, వారి జీవనోపాధికి ఇబ్బందులు కలిగించే విధానానికి స్వస్తి పలుకుతున్నామన్నారు.

 

తొలి విడతలో లక్ష ఇళ్ల నిర్మాణం

 

కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలో తొలి విడతగా లక్ష ఇందిరమ్మ టవర్స్‌ ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు. 23 నియోజకవర్గాల్లో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, ఇప్పటికే ఆరు ప్రాంతాల్లో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో తొలి విడతగా 480 మంది లబ్ధిదారులను పారదర్శకమైన బహిరంగ డ్రా ద్వారా ఎంపిక చేశామన్నారు.ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సొంత ఇళ్లు ఉన్నవారిని గుర్తించి, అర్హతలను ధ్రువీకరించిన తర్వాతే లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు వివరించారు. స్థానికంగా నివసిస్తూ, నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వారికే ఇళ్లు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 2.20 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. త్వరలో రెండో విడత ఇందిరమ్మ టవర్స్‌ కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు.ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్లు పొందిన లబ్ధిదారులకు కేవలం కేటాయింపు పత్రాలు మాత్రమే కాకుండా, ఎలాంటి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు లేకుండా పూర్తి హక్కులతో ఇళ్లను రిజిస్ట్రేషన్‌ చేసి అందజేస్తామని ప్రకటించారు. అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన భూమిలో వాటాను సైతం రిజిస్ట్రేషన్‌ పత్రాల్లో పొందుపరుస్తామని వివరించారు.

బతుకమ్మ నాటికి ఇళ్ల అందజేత లక్ష్యం

 

వచ్చే బతుకమ్మ పండుగ నాటికి తొలి విడత లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, వారి చేతుల మీదుగా తాళాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. తొలి విడతలో అవకాశం లభించని అర్హులు నిరాశ చెందవద్దని, తదుపరి విడతల్లో కొత్త దరఖాస్తుదారులతో పాటు అర్హులందరి దరఖాస్తులను పరిశీలిస్తామని భరోసా ఇచ్చారు.గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను సైతం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు. ఆయా కాలనీల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని, ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తించి సమీప ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు నిబంధనల ప్రకారం కేటాయించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ.440 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

అనంతరం మంత్రులు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెటింగ్‌ ఛైర్మన్‌ నర్సింహులు యాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, హౌసింగ్‌ శాఖ ఎండీ వి.పి.గౌతమ్‌, జిల్లా కలెక్టర్‌ మను చౌదరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!